ఆయన లేచియున్నాడు: అది ఇప్పుడు మనకు ఏమి సూచిస్తోంది

“ఆయన ఇక్కడ లేడు; ఆయన లేచియున్నాడు.” — లూకా 24:6

ప్రతి సంవత్సరం క్రైస్తవులు ఈ మాటలను ఆనందంతో మళ్లీ జ్ఞాపకం చేసుకుంటారు. మనం వాటిని పాడుతాం, ప్రకటిస్తాం, ఈస్టర్ సందర్భంలో తిరిగి వింటాం: ఆయన లేచియున్నాడు.

అయితే ఈ సంబరాల వెనుక ఇంకా నిజాయితీతో సమాధానం ఇవ్వవలసిన ఒక ప్రశ్న ఉంది: పునరుత్థానం ఇప్పుడు ఎందుకు ముఖ్యము? దాదాపు రెండువేల సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన ఈ రోజూ మన ఆలోచనను, విశ్వాసాన్ని, బాధను, నిరీక్షణను ఎందుకు ప్రభావితం చేయాలి?

పునరుత్థానం అనేది క్రైస్తవ విశ్వాసంలోని అనేక సిద్ధాంతాలలో ఒకటి మాత్రమే కాదు. అది చరిత్రలోని ఒక కీలక మలుపు. అది క్రైస్తవ విశ్వాసానికి హృదయం. క్రీస్తు నిజంగా లేచియుంటే, సత్యం ఇక అనిశ్చితంగా ఉండదు, విశ్వాసం ఇక శూన్యంగా ఉండదు, మరణం ఇక అంతిమం కాదు, నిరీక్షణ ఇక ఊహాజనిత ఆశ కాదు. పునరుత్థానం క్రైస్తవ కథలో ఒక అంచున నిలిచిన విషయం కాదు. అది మధ్యలో నిలబడి, మిగిలిన ప్రతిదానికి అర్థాన్ని ఇస్తుంది.

పునరుత్థానం సత్యాన్ని స్థిరపరుస్తుంది

మనము అభిప్రాయాలు, గందరగోళం, పరస్పర విరుద్ధమైన వాదనలతో నిండిన లోకంలో జీవిస్తున్నాము. సత్యాన్ని చాలాసార్లు వ్యక్తిగతమైనదిగా, మార్చుకోదగినదిగా, లేదా తానే నిర్వచించుకునేదిగా చూస్తారు. నిజాయితీగల విశ్వాసులు కూడా కొన్నిసార్లు జీవితం మసకబారినట్టుగా అనిపించే కాలాలను ఎదుర్కొంటారు. ప్రశ్నలు మెల్లగా మనసులోకి వస్తాయి. “మనం నమ్మేది నిజంగా సత్యమేనా?” అనే సందేహం నిశ్శబ్దంగా పైకి రావచ్చు. మరికొన్ని సందర్భాల్లో, “మనం ఎందుకు నమ్ముతున్నాం?” అని ఇతరులకు చెప్పడంలో కూడా మనకు కష్టం అనిపించవచ్చు.

అలాంటి క్షణాల్లో పునరుత్థానం మన కాళ్ల కింద గట్టి నేలను ఇస్తుంది.

“సత్యం ఏమిటి?” అనే ప్రశ్నకు కేవలం తత్వశాస్త్రంతోనే పూర్తి సమాధానం చెప్పడం సులభం కాదు. కానీ క్రైస్తవ విశ్వాసం కేవలం ఆలోచనలపై మాత్రమే నిలబడలేదు. అది చరిత్రలో జరిగిన ఒక సంఘటనపై నిలబడి ఉంది: యేసు క్రీస్తు సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, మళ్లీ లేచాడు. యేసు నిజంగా మృతులలోనుండి లేచియుంటే, ఆయన కేవలం జ్ఞానముగల బోధకుడు గానీ, నైతిక మాదిరి గానీ కాదు. ఆయన తనను తాను ఎవరని ప్రకటించుకున్నాడో నిజంగానే ఆయనే.

అది నిజమైతే, దేవుడు, పాపం, రక్షణ, తీర్పు, నిత్యజీవం గురించి ఆయన చెప్పినది కూడా నిజమే. జీవితం అస్పష్టంగా అనిపించినప్పుడు ప్రతి ప్రశ్నకు వెంటనే సమాధానం కనుగొనవలసిన అవసరం లేదు. మనం సిలువవద్దకు, ఖాళీ సమాధివద్దకు తిరిగి రావచ్చు. పునరుత్థానం నిజమైతే, క్రీస్తు నిజమే. అప్పుడు వాస్తవం మానవ అభిప్రాయాలపై కాదు, సజీవుడైన దేవునిపై నిలబడివుంటుంది.

పునరుత్థానం విశ్వాసానికి పునాది

ఈ విషయాన్ని పౌలు ఎంతో నేరుగా చెబుతున్నాడు:

“క్రీస్తు లేపబడకపోయి ఉంటే, మా బోధ వృథా; మీ విశ్వాసమును కూడా వృథా.” — 1 కొరింథీయులకు 15:14

ఈ మాటల్లో ఎలాంటి అస్పష్టత లేదు. కేవలం అభిమానం, సంప్రదాయం, లేదా భావోద్వేగంతో నిలిచే క్రైస్తవత్వానికి ఇక్కడ స్థలం లేదు. పునరుత్థానం లేకపోతే, యేసు గొప్పవాడిగా కనిపించవచ్చు. ప్రేరణనిచ్చేవాడిగా కూడా కనిపించవచ్చు. కానీ ఆయన లేచిన ప్రభువు కాదు. అప్పుడు సువార్త అసంపూర్ణమైన కథగా మిగులుతుంది. విశ్వాసం నిజాయితీగలదే అయినా శూన్యమైన ఆశగా మారిపోతుంది.

అందుకే పునరుత్థానం అంత ప్రాథమికమైనది. క్రైస్తవ విశ్వాసం కేవలం నైతిక బోధలపై లేదా ఆధ్యాత్మిక భావాలపై నిలబడలేదు. దేవుడు తన కుమారుని ద్వారా చరిత్రలో చేసిన కార్యంపై అది నిలబడి ఉంది. క్రీస్తు లేచకపోయి ఉంటే, మొత్తం నిర్మాణం కూలిపోతుంది. కానీ క్రీస్తు లేచియున్నట్లయితే, విశ్వాసం దృఢమైన పునాదిపై నిలుస్తుంది. అది దేవుని కార్యంపై నిలుస్తుంది. విశ్వాసం బలమైనది ఎందుకంటే విశ్వాసులు సహజంగా బలవంతులు కాబట్టి కాదు; దాని ఆధారం సజీవుడూ సత్యస్వరూపుడూ అయిన క్రీస్తు కావడం వల్ల.

పునరుత్థానం యేసును స్పష్టంగా చూపిస్తుంది

సువార్తలలో మళ్లీ మళ్లీ కనిపించే ఒక విశేషం ఏమిటంటే, యేసు తమతో ఉన్నప్పటికీ శిష్యులు ఆయనను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. ఆయన స్పష్టంగా మాట్లాడినా, వారు ఆయన మాటల లోతును గ్రహించడంలో మందగించారు. వారు విన్నారు; కానీ ఇంకా స్పష్టంగా చూడలేకపోయారు.

పునరుత్థానం తరువాతే విషయాలు వారికి స్పష్టమవడం ప్రారంభమైంది. యోహాను ఇలా వ్రాస్తాడు:

“ఆయన మృతులలోనుండి లేచిన తరువాత, ఆయన చెప్పిన మాటలను ఆయన శిష్యులు జ్ఞాపకము చేసికొనిరి; అప్పుడు వారు లేఖనమును, యేసు చెప్పిన మాటను నమ్మిరి.” — యోహాను 2:22

లూకా ఇలా చెబుతున్నాడు:

“అప్పుడు వారు లేఖనములను గ్రహించునట్లు ఆయన వారి మనస్సును తెరిచెను.” — లూకా 24:45

పునరుత్థానం యేసు పరిచర్య తరువాత జరిగిన ఒక సంఘటన మాత్రమే కాదు; అది ఆయన పరిచర్య మొత్తాన్ని ప్రకాశింపజేసింది. ఆయన మాటలు, అద్భుతాలు, హెచ్చరికలు, వాగ్దానాలు, తన గురించి చేసిన ప్రకటనలు — ఇవి అన్నీ ఖాళీ సమాధి వెలుగులోనే తమ సంపూర్ణ అర్థాన్ని పొందాయి.

ఇదే విషయం మనకు కూడా వర్తిస్తుంది. చాలామంది యేసులోని కొన్ని అంశాలను అభిమానిస్తారు; కానీ ఆయన సంపూర్ణతను చూడలేరు. కొందరు ఆయనను నైతిక బోధకుడిగా చూస్తారు. మరికొందరు ప్రేమకు లేదా త్యాగానికి ప్రతీకగా చూస్తారు. కానీ పునరుత్థానం మరింత లోతైన ప్రశ్నను మన ముందుంచుతుంది: మరణమే ఆయనను బంధించలేకపోతే, ఈయన ఎవరు?

ఖాళీ సమాధి యేసు గురించి మన అర్థానికి కేవలం ఇంకొక అంశాన్ని జోడించదు; అది మన అర్థాన్నే మార్చేస్తుంది.

పునరుత్థానం మరణంపై విజయ ప్రకటన

మానవుని అతి లోతైన సమస్య విజయం లేకపోవడం కాదు, సౌకర్యం లేకపోవడం కాదు, తాను తానే వ్యక్తీకరించుకోలేకపోవడం కూడా కాదు. అది మరణం. మరణం ప్రతి మనిషి జీవితంపై గొప్ప శత్రువులా నిలుస్తుంది. అది బలం, సౌందర్యం, ఆశయం, మేధస్సు, సాధన — అన్నింటినీ మౌనంగా చేస్తుంది. ఈ ప్రపంచంలో ఏదో లోతుగా విరిగిపోయిందని అది మనకు గుర్తుచేస్తుంది.

పునరుత్థానం మరణాన్ని చిన్న విషయంలా చూడమని చెప్పదు. అది దుఃఖాన్ని తగ్గించదు. నష్టాన్ని అవాస్తవం చేయదు. కానీ మరణాన్ని మించిన శక్తి ఇప్పటికే దానిని ఎదుర్కొని జయించిందని ప్రకటిస్తుంది.

పౌలు ఇలా వ్రాస్తాడు:

“మరణము విజయములో మింగబడెను.” — 1 కొరింథీయులకు 15:54

క్రీస్తు కేవలం మరణాన్ని భరించలేదు; దానిని జయించాడు. ఆయన సమాధిలోనికి ప్రవేశించి, ప్రభువుగా దానిలోనుండి బయటికి వచ్చాడు. ఇది ఆయనకు చెందిన వారందరికీ మరణపు అర్థాన్ని మార్చేస్తుంది. క్రైస్తవులు ఇంకా దుఃఖిస్తారు, అది సహజమే. కానీ మూసుకుపోయిన భవిష్యత్తు ఎదుట నిలబడినవారిలా వారు దుఃఖించరు. క్రీస్తు లేచియున్నాడు కాబట్టి, మరణానికి ఇక చివరి మాట లేదు. ఖాళీ సమాధి మన దృష్టిలో అంతిమంగా కనిపించేది, దేవుని దృష్టిలో అంతిమం కాదని చెబుతుంది.

పునరుత్థానం నిరీక్షణను సజీవంగా ఉంచుతుంది

పునరుత్థానం యేసు జీవిస్తున్నాడని మాత్రమే కాదు, పాపం ధ్వంసం చేసిన దానిని దేవుడు పునరుద్ధరించడానికి సంకల్పంతో ఉన్నాడని కూడా తెలియజేస్తుంది. ఈ ప్రపంచపు విరుగుడే చివరి స్థితి కాదు. మానవజీవితపు పాడుబడుదలే తుది గమ్యం కాదు. దేవుడు కేవలం పడిపోయిన లోకంలో మనుష్యులను నిలబెట్టడం మాత్రమే చేయడం లేదు. క్రీస్తులో ఆయన కొత్తదానిని ప్రారంభించాడు. పునరుత్థానం, పునరుద్ధరణ అనేది దూరంగా కనిపించే కల కాదు; అది ఇప్పటికే మొదలైన సజీవ వాస్తవమని ప్రకటించే దేవుని సాక్ష్యం.

అందుకే పునరుత్థానం మన జీవితంలోని ఇంకా పూర్తికాని ప్రదేశాలకూ ఆశను ఇస్తుంది. మనం మోసుకొచ్చే గందరగోళం, మనలో మిగిలిన గాయాలు, ఇప్పటికీ బాధించే వైఫల్యాలు, మనలో కఠినమైపోయిన లేదా అస్తవ్యస్తమై ఉన్న భాగాలు — ఇవి అన్నీ ఇప్పుడు వేరే వెలుగులో కనిపిస్తాయి. దేవుడు పడిపోయిన ప్రపంచాన్ని తిరిగి స్వాధీనం చేసుకొని, పడిపోయిన మానవత్వాన్ని నూతనపరుస్తున్నాడనుకుంటే, మన జీవితంలో ఆయన స్వస్థపరచలేనిది, క్రమపరచలేనిది, పరిపక్వం చేయలేనిది, మళ్లించలేనిది, విమోచించలేనిది ఏదీ లేదు.

మొదటి ఆదాము ద్వారా సృష్టి పతనమయినదాన్ని మొదటి తోట చూచింది. పునరుత్థానపు తోట, క్రీస్తు ద్వారా పునరుద్ధరణ ప్రారంభమైందని ప్రకటిస్తుంది. ఒక దృశ్యం పతన చరిత్రను ప్రారంభించింది. మరొకటి నూతన సృష్టికి ద్వారం తెరిచింది. అందుకే నిరీక్షణ ఇక బలహీనమైనది కాదు. లేచిన క్రీస్తు పునరుద్ధరణను నమ్మదగినదిగా చేశాడు.

అన్నిటినీ మార్చిన రోజు

అందువల్ల యేసు క్రీస్తు పునరుత్థానం కేవలం భక్తి పరమైన ఆలోచన మాత్రమే కాదు. అది మానవ చరిత్రలో అత్యంత ముఖ్యమైన రోజు. క్రీస్తు జన్మించి, లేచకపోయి ఉంటే, మనము ఇంకా మన పాపాలలోనే ఉండి, మరణపు నీడ కిందనే మిగిలిపోయేవాళ్లము. కానీ ఆయన లేచినందున, అన్నీ మారిపోయాయి.

సత్యం స్థిరపడింది. విశ్వాసం పునాది పొందింది. క్రీస్తు స్పష్టమయ్యాడు. మరణం జయించబడింది. నిరీక్షణ సజీవమైంది.

కాబట్టి క్రైస్తవులు “ఆయన లేచియున్నాడు” అని చెప్పినప్పుడు, అది ఒక పండుగకు సంబంధించిన వాక్యాన్ని పునరావృతం చేయడం కాదు. మిగిలిన ప్రతిదాని అర్థం ఆధారపడిన సంఘటనను మనం ప్రకటిస్తున్నాము.

— రాజేష్ గొట్టిముక్కల