నిత్యకాలం నిలిచే స్నేహం

మన జీవితంలో స్నేహితులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కుటుంబ సభ్యులు, తోబుట్టువులు, జీవిత భాగస్వామి కూడా కొన్నిసార్లు ఇవ్వలేని ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని, స్వేచ్ఛను, ఆత్మీయతను మంచి స్నేహితులు మనకు ఇస్తారు. వారితో మనసు విప్పి మాట్లాడగలం, సంకోచం లేకుండా నవ్వగలం, మన ఆలోచనలను, బాధలను పంచుకోగలం.

మంచి స్నేహితులు ఉండటం నిజంగా ఒక గొప్ప అదృష్టం!

కానీ జీవితం ముందుకు సాగుతున్న కొద్దీ స్నేహాలు కూడా మారిపోతుంటాయి. పాఠశాల నుంచి కళాశాలకు, అక్కడి నుంచి ఉద్యోగాలకు వెళ్తాం. కొత్త ప్రాంతాలకు మారతాం. పెళ్లిళ్లు, పిల్లలు, కుటుంబ బాధ్యతలతో జీవితం బిజీగా మారుతుంది. ఒకప్పుడు ప్రతిరోజూ మనతో గడిపిన స్నేహితులతో క్రమంగా మాట్లాడటం కూడా తగ్గిపోతుంది. కొన్ని స్నేహాలు మెల్లగా దూరమవుతాయి. మరికొన్ని అనుకోకుండా ముగిసిపోతాయి.

జీవితాంతం మనతో నిలిచే మంచి స్నేహితుడు ఉండటం గొప్ప ఆశీర్వాదం. కానీ అలాంటి స్నేహం అందరికీ దొరకకపోవచ్చు.

కొందరు స్నేహితులు కొంతకాలం తోడుంటారు. మరికొందరు జీవితాంతం తోడుంటారు. కానీ నిత్యకాలం మనతో నిలిచే ఒక స్నేహితుడు ఉన్నాడు.

ఆ స్నేహితుడే యేసుక్రీస్తు.

యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు:

“నేను మిమ్మును స్నేహితులని పిలిచితిని.” (యోహాను 15:15)

ఒక్కసారి ఆలోచించండి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తే మనల్ని తన స్నేహితులుగా పిలుస్తున్నాడు!

ఇది కేవలం చరిత్రలో చదివే ఒక స్నేహం కాదు. యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచిన సజీవుడైన రక్షకుడు. ఆయన వాక్యం ద్వారా ఆయనను తెలుసుకోవచ్చు. ప్రార్థనలో ఆయనతో మాట్లాడవచ్చు. మన సంతోషాలను, బాధలను ఆయనతో పంచుకోవచ్చు. ప్రతిరోజూ ఆయనకు మరింత దగ్గరవచ్చు.

ఆయన మనకు ఇచ్చిన వాగ్దానం ఎంత అందమైనదో చూడండి:

“ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను.” (మత్తయి 28:20)

ఎంత గొప్ప ఆదరణ! దూరం వల్ల తగ్గిపోని స్నేహం. కాలంతో మారిపోని ప్రేమ. పరిస్థితులను బట్టి మారని నమ్మకత్వం.

కొన్నిసార్లు మనమే ఆయనకు దూరమవ్వవచ్చు. కానీ ఆయన మనలను విడిచిపెట్టడు. దేవుని వాక్యం మనకు ఇలా గుర్తుచేస్తుంది:

“నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను.” (హెబ్రీయులకు 13:5)

కాబట్టి దేవుడు మన జీవితంలో ఇచ్చిన మంచి స్నేహితులను ప్రేమిద్దాం. ఆ స్నేహాలను కాపాడుకుందాం. మనం కూడా ఇతరులకు మంచి స్నేహితులుగా ఉందాం.

అన్నిటికంటే ముఖ్యంగా, మనకు అందుబాటులో ఉన్న ఈ గొప్ప స్నేహాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉందాం.

యేసుక్రీస్తును మీరు మీ స్నేహితునిగా తెలుసుకున్నారా?

ఆయన గురించి కేవలం వినడం మాత్రమే కాదు. ఆయనను వ్యక్తిగతంగా తెలుసుకొని, నమ్మి, ప్రేమించి, ప్రతిరోజూ ఆయనతో నడుస్తున్నారా?

ప్రభువైన యేసయ్యా, ఎల్లప్పుడూ తోడుండే స్నేహితునిగా ఉన్నందుకు నీకు వందనాలు. జీవితంలోని ప్రతి పరిస్థితిలో నీకు మరింత దగ్గరగా ఎదగడానికి, నిన్ను మరింతగా నమ్మడానికి, నీ స్నేహంలో ఆనందించడానికి నాకు సహాయం చేయుము.

యేసయ్యా, నీవంటి స్నేహితుడు మరెవరు!