మారనివాడైన దేవునిలో ధైర్యాన్ని కనుగొనండి.
మార్పు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో తప్పకుండా వస్తుంది — మనం ఎవరో, ఏమి చేస్తున్నామో, ఎక్కడ జీవిస్తున్నామో అన్నదానితో సంబంధం లేకుండా. కొన్ని మార్పులు చిన్నవిగా ఉంటాయి, కాలక్రమేణా వాటికి అలవాటు పడతాం. కానీ కొన్ని మార్పులు లోతుగా తాకుతాయి. మనం ఆధారపడిన స్థానం లేదా పరిస్థితి మారిపోతుంది. మనం నమ్మిన స్వరం అదే విధంగా ఇక వినిపించదు. జీవితానికి స్థిరత్వం ఇచ్చిన నిర్మాణం కదలడం మొదలవుతుంది. కొత్త బాధ్యత మన భుజాల మీద పడుతుంది. అప్పుడు భవిష్యత్తు ముందుకంటే భారంగా అనిపిస్తుంది.
తన పేరుతో ఉన్న గ్రంథం ప్రారంభంలో యెహోషువ అలాంటి స్థితిలో నిలబడ్డాడు. ఇశ్రాయేలును ఐగుప్తు నుండి బయటకు నడిపించిన మోషే, ఫరో ఎదుట నిలిచిన మోషే, ధర్మశాస్త్రాన్ని పొందిన మోషే, ప్రజల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించిన మోషే, దేవునితో మాట్లాడిన మోషే — ఇప్పుడు ఇక వారిని నడిపించడం లేదు. యెహోషువ మోషేతో పాటు సేవ చేశాడు, అతని నాయకత్వాన్ని చూశాడు, అతని దగ్గర నేర్చుకున్నాడు. ఇప్పుడు దేవుని ప్రజలను వాగ్దాన దేశంలోకి నడిపించే బాధ్యత యెహోషువ భుజాల మీద పడింది.
“నా సేవకుడైన మోషే మృతినొందెను; కాబట్టి ఇప్పుడు నీవును ఈ ప్రజలందరును లేచి యొర్దాను దాటుడి.” (యెహోషువ 1:2)
ఏమి మారిందో దేవునికి తెలుసు
యెహోషువ ఎదుర్కొంటున్న వాస్తవాన్ని దేవుడు స్పష్టంగా చెప్పి, తన ఉద్దేశ్యంలో తర్వాతి దశకు అతనిని పిలిచాడు. మనకూ ధైర్యం అవసరమయ్యేది చాలాసార్లు ఇలాంటి సమయాల్లోనే. ఒక కాలం ముగుస్తుంది, ఒక బాధ్యత మారుతుంది, మనం ఆధారపడిన వ్యక్తి అదే విధంగా ఇక ఉండడు, లేదా స్థిరంగా అనిపించినది కదలడం మొదలవుతుంది. మనం సిద్ధంగా లేమని అనిపించవచ్చు, కానీ ఏమి మారిందో, ఆ మార్పు మన దగ్గర ఏమి కోరుతున్నదో దేవునికి స్పష్టంగా తెలుసు.
ఈ లోకంలో మనం ఆధారపడే విషయాలు నిజంగా మంచివి, ఉపయోగకరమైనవే కావచ్చు. మోషే దేవునిచే ఎన్నుకోబడి, దేవునిచే గొప్పగా ఉపయోగించబడిన అద్భుతమైన నాయకుడు. అయినా మంచి నాయకులు కూడా శాశ్వతం కాదు. మంచి కాలాలు ఎప్పటికీ ఉండవు. మంచి నిర్మాణాలు ఎప్పటికీ నిలిచిపోవు. దేవుడు వాటి ద్వారా మనలను ఆశీర్వదించవచ్చు, నడిపించవచ్చు, బలపరచవచ్చు. కానీ ఈ లోకంలోని ఏదైనా పరిమితమే; అది మనకు ఎప్పటికీ ఆధారంగా ఉండలదు.
దేవుడే ధైర్యాన్ని ఇస్తాడు
“బలముగాను ధైర్యముగాను నుండుము.” (యెహోషువ 1:6)
దేవుడు ఈ మాటలను యెహోషువకు మళ్లీ మళ్లీ చెప్పాడు. బలముగాను ధైర్యముగాను ఉండమని, మరింత బలముగాను ధైర్యముగాను ఉండమని, భయపడవద్దని, దిగులుపడవద్దని ఆయన చెప్పాడు. యెహోషువ పరిస్థితి దేవునికి తెలుసు. యెహోషువకు ఏమి అవసరమో కూడా ఆయనకు తెలుసు.
యెహోషువకు ధైర్యం అవసరం. కానీ అది వ్యక్తిత్వం, పదవి, అనుభవం, లేదా మోషేతో పోలిక మీద నిలిచే ధైర్యం కాదు. శాశ్వతమైనదానిలో, ఎప్పుడూ ఉన్నవాడిలో వేర్లు పాతుకున్న ధైర్యం అవసరం. మోషేతో ఉన్న దేవుడు తనతో కూడా ఉంటాడని యెహోషువ తెలుసుకోవాలి.
ఇది మనకూ బలమైన పాఠం. చుట్టూ ఉన్న పరిస్థితులు మారినప్పుడు మనం చాలాసార్లు కదిలిపోయే విషయాల్లోనే ధైర్యం వెతుకుతాం — మన సామర్థ్యం, మన ప్రణాళికలు, మన సంబంధాలు, మన భద్రత, మన గత విజయాలు, లేదా మనుషుల అంగీకారం. ఇవన్నీ కొంత విలువ కలిగి ఉండవచ్చు. కానీ ఇవి శాశ్వతం కావు. నిజమైన ధైర్యం మారనివాడైన దేవునిమీదే నిలవాలి.
నాయకుడు మారినా, దేవుడు మారలేదు
“నేను మోషేతో ఉండినట్లు నీతో కూడ ఉండెదను; నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను.” (యెహోషువ 1:5)
యెహోషువ చూసి నేర్చుకున్న నాయకుడు ఇక అక్కడ లేడు. కానీ మోషేతో ఉన్న దేవుడు ఇప్పుడు యెహోషువతో నేరుగా మాట్లాడుతున్నాడు. ఆ క్షణంలో యెహోషువకు అవసరమైన మాటను దేవుడే ఇచ్చాడు.
దేవుడు యెహోషువ భయాన్ని, బాధ్యతను, మార్పును తన వాగ్దానంతో సంభోదించాడు. ఆయన యెహోషువకు తన మారని సన్నిధి మీద నిలిచిన ధైర్యాన్ని ఇచ్చాడు. యెహోషువ ముందుకు సాగగలిగాడు, ఎందుకంటే అతని ధైర్యపు మూలం మారలేదు.
మనం యెహోషువ ఎదుర్కొన్న అదే పరిస్థితులను ఎదుర్కోకపోవచ్చు. దేవుని స్వరాన్ని అతడు విన్న అదే విధంగా మనం వినకపోవచ్చు. కానీ మన జీవితాల్లో కూడా మార్పు తప్పదు; అది భవిష్యత్తు గురించి ఆందోళనను, భయాన్ని తెచ్చివేయవచ్చు. మార్పు మనలో ఏమి చేస్తుందో దేవునికి ఇప్పటికీ తెలుసు. ఆయన వాక్యముచేత, పరిశుద్ధాత్మచేత, తన నమ్మకమైన సన్నిధిచేత, తన ప్రజలకు ఆయన ఇప్పటికీ ధైర్యం ఇస్తాడు.
శాశ్వతుడైన దేవునిపై దృష్టి నిలుపుకోండి
“యెహోవానైన నేను మార్పులేనివాడను.” (మలాకీ 3:6)
చుట్టూ ఉన్న పరిస్థితులు మారినప్పుడు, పెద్ద ప్రమాదం మార్పు మాత్రమే కాదు. శాశ్వతం కావాలని ఉద్దేశించబడని వాటిమీద మన విశ్వాసాన్ని ఉంచడమే పెద్ద ప్రమాదం. మన జీవితంలోని ఉత్తమమైన వ్యక్తులు, ఉత్తమమైన కాలాలు, ఉత్తమమైన పాత్రలు, ఉత్తమమైన ఆధారాలు కూడా తాత్కాలికమే. అవి మనలను నడిపించవచ్చు, ఆశీర్వదించవచ్చు, సహాయం చేయవచ్చు. కానీ అవి దేవుని స్థానాన్ని తీసుకోలేవు.
యెహోషువ ఈ పాఠాన్ని ఒక కీలకమైన క్షణంలో నేర్చుకోవలసి వచ్చింది. మోషే నాయకత్వం ముగిసింది, కానీ దేవుని సన్నిధి ముగియలేదు. కనిపించే ఆధారం మారింది, కానీ ధైర్యానికి నిజమైన మూలం అలాగే ఉంది. యెహోషువ తన విశ్వాసాన్ని తనతో ఉండే దేవునిపై నిలిపి ముందుకు సాగగలిగాడు.
జీవితం కష్టంగా ఉన్నప్పుడు, చుట్టూ ఉన్న పరిస్థితులు మారినప్పుడు మనకూ ఇదే పాఠం. కదిలిపోయే వాటిమీద నీ ధైర్యాన్ని కట్టవద్దు. మనుషులు, స్థలాలు, కాలాల ద్వారా దేవుడు ఇచ్చే సహాయాన్ని, ఆధారాన్ని స్వీకరించు. కానీ నీ హృదయాన్ని శాశ్వతుడైన దేవునిపైనే నిలుపుకో.
మార్పు రావచ్చు. ఒక కాలం ముగియవచ్చు. ఒక బాధ్యత భారంగా మారవచ్చు. కానీ దేవుడు నమ్మకమైనవాడే. దేవుడు నీతో ఉన్నవాడే. దేవుడే తన ప్రజల ధైర్యానికి మూలం.
ఆయన మారనివాడు కాబట్టి, నీవు జీవితంలో వచ్చే మార్పులను ధైర్యంగా దాటగలవు.